Posted by admin on 2025-02-04 17:19:22 | Last Updated by admin on 2025-04-23 17:35:59
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 55
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.
వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ పలు జిల్లాల్లో పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించింది. నేరుగా ప్రజలను కలుసుకుని విజ్ఞప్తులు సేకరించింది. మరికొందరు కమిషన్కు ఆన్లైన్ ద్వారా విజ్ఞప్తులు అందించారు. 82 రోజుల్లో కమిషన్ తన నివేదికను అందించింది. 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీల్లో మొత్తం 59 ఉప కులాలను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్ సిఫారసు చేసింది.
గ్రూప్-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్ (జనాభా 3.288 శాతం), గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్ (జనాభా 62.74 శాతం), గ్రూప్-3లోని 26 ఉప కులాలకు 5శాతం రిజర్వేషన్ (జనాభా 33.963శాతం) కల్పించాలని వర్గీకరణ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఎస్సీ కులాల గ్రూప్లకు రోస్టర్ పాయింట్లు, క్రిమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీ వర్గీకరణ, కులగణన.. నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన అంశాలు. ఫిబ్రవరి 4, 2025.. నా రాజకీయ జీవితంలో ప్రత్యేకంగా గుర్తుండి పోతుంది.
ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చింది. చాలా రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఓటు బ్యాంకుగా చూశాయి తప్ప.. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేయలేదు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో తరతరాలుగా నిర్లక్ష్యానికి, దోపిడీకి గురైన వారికి న్యాయం చేయాలని సంకల్పించాం. వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతున్నా అని రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
30, 40 ఏళ్ల నాటి ఆకాంక్ష నేడు సాకారం అవుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోంది. వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలగదు.అంటరానితనం అనేది ప్రపంచం అంతటా ఉంది. ఎంత చదువుకున్నా.. ఎంత ఎదిగినా.. ఎక్కడో ఒకచోట వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. గాంధీజీ, అంబేడ్కర్ వంటి మహనీయులకు కూడా వివక్ష తప్పలేదు. సామాజిక న్యాయం ఎక్కువగా కల్పించింది కాంగ్రెస్ పార్టీయే. 50 ఏళ్ల క్రితమే దళితనేత దామోదరం సంజీవయ్యను ఉమ్మడి రాష్ట్రానికి సీఎంను చేసింది కాంగ్రెస్ పార్టీ. జగ్జీవన్రామ్, దామోదరం సంజీవయ్య వంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చింది. సామాజిక ఫలాలు అందరికీ అందాలనేది కాంగ్రెస్ పార్టీ తపన. ఎస్సీ వర్గీకరణ నిర్ణయం రాజకీయ కారణాలతో తీసుకోలేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి తీసుకున్న నిర్ణయం ఇది. ప్రభుత్వానికి సంబంధం లేకుడా కమిషన్ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఉంటుందని ఏఐసీసీ ఎప్పుడో చెప్పింది అని పేర్కొన్నారు.