Posted by admin on 2025-02-05 01:01:30 | Last Updated by admin on 2025-04-23 17:28:08
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 70
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చజెండా ఊపాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నాలుగు సిఫార్సులు చేసింది. వాటిలో... రాష్ట్రంలోని మొత్తం 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనలను ఆమోదించిన సర్కారు... క్రీమీలేయర్ సిఫార్సును తిరస్కరించింది. మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను మంగళవారం శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టింది. రెండుచోట్లా నివేదికకు ఆమోదం లభించింది. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న వారికి లబ్ధి చేకూరనుంది.జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్.... సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్-1లో, మధ్యస్థ లబ్ధిపొందిన కులాలను గ్రూప్-2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్-3లో చేర్చింది. 2011 జనాభా గణాంకాల ప్రాతిపదికన... ఎస్సీ జనాభాలో 61.967% మంది ఉన్న మాదిగ కులంతోసహా 18 కులాలను గ్రూప్-2 కింద చేర్చి 9% రిజర్వేషన్లను ప్రతిపాదించింది. 29.26% మంది ఉన్న మాల, మాలఅయ్యవార్ కులంతోసహా 26 కులాలను గ్రూప్-3లో చేర్చి 5% రిజర్వేషన్లను, ఇక 3.28% మంది ఉన్న 15 కులాలను గ్రూప్-1లో చేర్చి ఒక శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించింది.
ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ 199 పేజీల నివేదిక అందజేసింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. 2024 నవంబరు 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్ 82 రోజుల వ్యవధిలోనే అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2024 డిసెంబరు 4 నుంచి ఈ ఏడాది జనవరి 3 వరకు రాష్ట్రంలోని పూర్వ జిల్లాల్లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించి, అభిప్రాయాలను తెలుసుకుంది. కొన్ని జిల్లాల్లోని ఆవాసాలను సైతం సందర్శించింది. పర్యటనల్లో ప్రజల నుంచి నేరుగా అందిన 4,750 వినతులతోపాటు హైదరాబాద్లోని విచారణ కమిషన్ కార్యాలయానికి ఆఫ్లైన్, ఆన్లైన్లో వచ్చిన 8,681 విజ్ఞప్తులను పరిశీలించింది. వీటితోపాటు ఎస్సీల్లోని 59 కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన డేటాను అధ్యయనం చేసిన కమిషన్ తన నివేదికను రూపొందించింది.
సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ ప్రభుత్వానికి నాలుగు సిఫార్సులు చేసింది. ఇందులో మొదటి సిఫార్సుగా... ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలంది. రెండోదిగా... ఉద్యోగాల భర్తీ సమయంలో ఖాళీగా మిగిలిన పోస్టులకు తదుపరి ప్రకటనకు క్యారీఫార్వర్డ్ చేయాలని సూచించింది. మూడోదిగా... ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్ల ఖరారును ప్రతిపాదించింది. నాల్గోదిగా... ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ను ప్రవేశపెట్టాలంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీఛైర్మన్లు, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతోపాటు గ్రూప్-1 సర్వీసులో ఉన్న వారిని క్రీమీలేయర్గా పరిగణించాలని ప్రతిపాదించింది. ఈ వ్యక్తుల రెండోతరం రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందకుండా మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. తొలి మూడింటిని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం... నాలుగో సిఫార్సుగా ఉన్న క్రీమీలేయర్ ప్రతిపాదనను తిరస్కరించింది.